ఒకే గదిలో కుక్క, చిరుతపులి.. ‘ఇది భారతదేశంలో మాత్రమే జరుగుతుంది’..!

ఓ కుక్క, చిరుతపులి ఓ మరుగుదొడ్డిలో చిక్కుకున్నాయి. తొమ్మిది గంటల పాటు అవి కేవలం ఒక మీటర్ దూరంలో కూర్చొని ఉన్నాయి. అంత దగ్గర్లోనే కుక్క ఉన్నా ఏమాత్రం కిక్కురుమనకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఈ ఘటన కర్ణాటకలోని బిలినెలే గ్రామంలో జరిగింది. గ్రామంలో జయలక్ష్మి అనే వ్యక్తికి ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ లోని మరుగుదొడ్డిలో ఓ కుక్క పరుగెత్తుకుంటూ వచ్చింది. 

ఆ కుక్కను వెంబడిస్తూ ఓ చిరుతపులి కూడా వచ్చింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో దీనిని గమనించిన జయలక్ష్మి భయపడుతూనే టాయ్ లెట్ డోర్ కు తాళం వేశాడు. ఆ తర్వాత అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అక్కడికి వచ్చిన అధికారులు కిటికీలోంచి చూసి షాక్ అయ్యారు.

 పులి, కుక్క ఎదురెదురుగా సమీపంలో కుర్చున్నాయి. ఎలాంటి హడావుడి లేకుండా నిశ్శబ్దంగా ఉన్నాయి. అటవీ అధికారులు ఎంతో చాకచక్యంగా చిరుత పులిని పట్టుకున్నారు. కుక్కకు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా, దీనికి సంబంధించిన ఫొటోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది. ఓ గదిలో పులితో పాటు గంటల పాటు కుక్క చిక్కుకుపోవడాన్ని ఊహించండి. అది సజీవంగా బయటపడింది. ఇది భారతదేశంలో మాత్రమే జరుగుతుంది’ అంటూ రాసుకొచ్చారు. 

Leave a Comment