పోలీసులతో వాగ్వాదానికి దిగిన మహిళ..!

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఈనేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కఠిన ఆంక్షలు విధించింది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించాలని ఆదేశించింది. ఈక్రమంలో ఢిల్లీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా నిబంధనలు పాటించాలని చెప్పిన పోలీసులపై ఓ జంట దురుసుగా ప్రవర్తించింది. వారితో వాగ్వాదానికి దిగింది. ఈ ఘటన ఢిల్లీలోని దరియాగంజ్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఢిల్లీకి చెందిన దంపతులు తమ కారులో రోడ్డుపైకి వచ్చారు. దరియాగంజ్ ఏరియాలో తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులు వారిని ఆపారు. మాస్క్ ధరించకపోవడంతో వారిని ప్రశ్నించారు. కారులో ప్రయాణిస్తున్నప్పటికీ మాస్క్ ధరించాలని ప్రభుత్వం ఆదేశించిందని పోలీసులు గుర్తు చేశారు. అయితే అవేమీ పట్టించుకోకుండా ఆ దంపతులిద్దరూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ‘నా భర్తను నేను ముద్దు పెట్టుకుంటాను.. మీరు నన్ను ఆపగలరా? అంటూ సదరు మహిళ పోలీసులను ప్రశ్నించింది. నా భార్యతో కారులో ఉన్నప్పుడు ఎందుకు ఆపారని ఆ వ్యక్తి ప్రశ్నించాడు. దీంతో పోలీసులు ఈ ఘనటపై కేసు నమోదు చేసుకున్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో కారు యజమాని పంకజ్ దత్తాను అరెస్ట్ చేశారు.

Leave a Comment