తాను మరణించి.. మరో ఐదుగురిని బతికించిన చిన్నారి..!

పుట్టిన వారు మరణించక తప్పదు.. కానీ మరీ లోకం చూడకుండానే.. చిన్న వయస్సులోనే మరణిస్తే ఆ కుటుంబ సభ్యుల బాధ వర్ణాతీతం.. అలా బోసి నవ్వులతో, బుడి బుడి అడుగులతో కన్నవారి కళ్లల్లో ఆనందం నింపాల్సిన 20 నెలల చిన్నారికి అప్పుడే నిండు నూరేళ్లు నిండాయి. అయితే తాను వెళ్తూ మరో ఐదుగురి జీవితాలకు ఆయుష్షు పోసింది. దేశంలోనే అతి చిన్న వయస్సు అవయవ దాతగా నిలిచింది. 

 ఢిల్లీకి చెందిన ఆశిశ్ కుమార్, బబిత దంపతుల కూతురు ధనిష్ట. ఈమెకు 20 నెలల వయస్సు ఉంటుంది. ధనిష్ట ఈనెల 8న బాల్కనీలో నుంచి కింద పడింది. దీంతో గంగారామ్ ఆస్పత్రిలో తీసుకెళ్లగా ఈనెల 11న ఆ పాప బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రులు విషాదంలో ఉండిపోయారు. 

అంతటి విషాదంలోనూ తల్లిదండ్రులు ఆశిశ్ కుమార్, బబితా.. ఆ చిన్నారి అవయవాలను దానం చేయాలని నిర్ణయించారు. ఇప్పుడా అవయవాలే ఐదుగురి ప్రాణాలను కాపాడినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపింది. ధనిష్ట యొక్క గుండె, కాలేయం, రెండు కిడ్నీలు, కార్నియాలను ఐదుగురు పేషంట్లకు అమర్చారు. తమ పాప చనిపోయినా ఆ ఐదుగురిలో జీవించే ఉంటుందని ఆ తల్లిదండ్రులు చెప్పారు. 

 

Leave a Comment