93 ఏళ్ల వయస్సులో కూడా విద్యార్థులకు పాఠాలు..!

ఆమె వయస్సు 93 ఏళ్లు.. ఇప్పటికీ ఆమె విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు చెబుతున్నారు.. రోజుకు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పాఠాలు చెబుతూ తన వృత్తిని ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తున్నారు. ఆమె పేరు ప్రొఫెసర్ చిలుకూరి శాంతమ్మ.. భౌతిక శాస్త్రంపై తనకున్న మక్కువతో పాఠాలు బోధిస్తుననారు.. 

ఆమె ప్రస్తుతం విజయనగరం జిల్లా సెంచూరియన్‌ యూనివర్శిటీలో రెండు ఊత కర్రల సాయంతో నడుస్తూ విద్యార్థులకు భౌతిక శాస్త్ర పాఠాలు చెబుతున్నారు..  వయసు మీదపడిందనే సంకోచం ఏమాత్రం ఆమెలో కనిపించలేదు. ఈ వయసులోనూ సంపూర్ణ ఆరోగ్యంతో అధ్యాపకురాలిగా 

ప్రొఫెసర్ శాంతమ్మ 1929 మార్చి 8న మంచిలీపట్నంలో జన్మించారు. తన ఐదు నెలల వయసులో తండ్రిని కోల్పోయారు. ఆ తర్వాత తండ్రి తరఫు మేనమామ వద్ద పెరిగారు.. రాజమండ్రి, మదనపల్లి ప్రాంతాల్లో పాఠశాల విద్యాభ్యాసం, విశాఖపట్నం మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏవీఎన్ కళాశాలలో ఇంటర్ చదివారు.  

అప్పుడు ఆమె మహారాజా విక్రమ్ దేవ్ వర్మ నుంచి భౌతిక శాస్త్రంలో బంగారు పతకాన్ని అందుకున్నారు.  ఆంధ్రా యూనివర్సిటీ నుండి మైక్రోవేవ్‌ స్పెక్ట్రోస్కోపీలో పీహెచ్‌డీకి సమానమైన డీఎస్సీ పూర్తి చేసి, ఆ తర్వాత 1956లో ఆంధ్రా యూనివర్సిటీలోని కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఫిజిక్స్‌ లెక్చరర్‌గా చేరారు. లెక్చరర్‌ నుండి ప్రొఫెసర్, ఇన్వెస్టిగేటర్, రీడర్‌ వరకూ అనేక బాధ్యతలు నిర్వర్తించారు.

 1989లో పదవీ విరమణ చేశారు. అయితే ఫిజిక్స్ పై ఇష్టంతో ఆమె మళ్లీ ఆంధ్రా యూనివర్సిటీలో గౌరవ అధ్యాపకురాలిగా చేరారు. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్, యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో పరిశోధనాత్మక ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేశారు..

 వృత్తిలో భాగంగా చాలా దేశాలు వెళ్లొచ్చారు. యూఎస్, బ్రిటన్, కెనడా, స్పెయిన్‌తో సహా అనేక దేశాల్లో జరిగిన సమావేశాలకు హాజరయ్యారు. అటామిక్‌ స్పెక్ట్రోస్కోపీ, మాలిక్యులర్‌ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించిన అంశాలపై చేసిన విశ్లేషణ 2016లో వెటరన్‌ సైంటిస్ట్స్‌ క్లాస్‌లో అనేక అవార్డులతో పాటు బంగారు పతకాన్ని సాధించారు. 12 మంది విద్యార్థులు తన పర్యవేక్షణలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 

పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులపై ఆసక్తితో.. భగవద్గీత శ్లోకాలను ఆంగ్లంలోకి అనువాదం చేసి ‘భగవద్గీత ది డివైన్‌ డైరెక్టివ్‌‘ అనే పుస్తకాన్ని రచించారు.. ఆమె భర్త చిలకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. ఆయన తెలుగు ప్రొఫెసర్.. 

ప్రొఫెసర్ శాంతమ్మ ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తారు..ప్రతిరోజూ విశాఖపట్నంలో బయలుదేరి విజయనగరం చేరుకుంటారు. ఇక్కడి సెంచూరియన్‌ యూనివర్శిటీలో రోజుకు కనీసం ఆరు క్లాసులు తీసుకుంటారు.. చిత్రమేమిటంటే ఆంధ్రా యూనివర్శిటీ మాజీ వీసీ, ఇప్పుడు సెంచూరియన్‌ యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్‌ జీఎస్‌ఎన్‌ రాజు ఆమె దగ్గరే చదువుకున్నారు. 

 

 

Leave a Comment