ఏడో తరగతి బాలికకు గుండెపోటు.. క్లాస్ రూంలోనే మృతి..!

గతంలో గుండెపోటు అనేది ఎప్పుడో 50 సంవత్సరాలు దాటకా వచ్చేది. కానీ ఈమధ్య యుక్తవయస్సులోనే గుండెపోటు రావడం చూస్తున్నాం.. అయితే చిన్న పిల్లలకు గుండెపోటు రావడం అనేది చాలా రేర్..కానీ ఆశ్చర్యకరంగా ఏడో తరగతి చదువుతున్న బాలికకు గుండెపోటు వచ్చింది. అప్పటి వరకు అందరితో కలసి మెలసి ఉండి.. హాయిగా నవ్వుకుంటూ.. ఆనందంగా గడిపింది. కానీ హఠాత్తుగా గుండెపోటు రావడంతో తరగతి గదిలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

నెల్లూరు జిల్లా వింజమూరు బాలికోన్నత పాఠశాలలో షేక్ సాజిదా(13) ఏడో తరగతి చదువుతోంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధన చేస్తున్న సమయంలో ప్రశ్నలు అడిగారు. ఒకటి రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. తర్వాత ఒక్కసారిగా కనుగుడ్లు తేలేస్తూ అకస్మాత్తుగా కింద పడిపోయింది.  

ఇది చూసి ఆందోళన చెందిన ఉపాధ్యాయులు విద్యార్థినికి ఫిట్స్ వచ్చాయనుకున్నారు. తాళపు చెవులు చేతులో పెట్టి నీటితో మొమం కడిగారు. తర్వాత స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే పాప చనిపోయిందని నిర్ధారించారు. గుండెపోటుతో బాలిక మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఉపాధ్యాయులతో పాటు అందరూ షాక్ అయ్యారు. చిన్నపాటి అనారోగ్యం కూడా లేని తమ కుమార్తె ఒక్కసారిగా ప్రాణాలు పోవడం ఏంటని.. తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. 

Leave a Comment