డయాబెటీస్ బాధితుల కోసం కొత్త రకం చెప్పులు తయారు చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మెకానికల్ ఇంజనీరింగ్, కర్ణాటక ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ రీసెర్చ్ విభాగాల పరిశోధకులు ఈ వినూత్న చెప్పులను రూపొందించారు. 3డి ప్రింటెడ్ స్నాపింగ్ టెక్నాలజీతో ఈ పాదరక్షలను తయారు చేశారు.
డయాబెటిస్ బాధితుల్లో కాళ్లకు గాయాలైతే త్వరగా మానవు. దీంతో ఇన్ఫెక్షన్ ఏర్పడి కాలు తొలగించే పరిస్థితి రావొచ్చు. ఇలాంటి వారి కోసం ఈ 3డీ ప్రింటెడ్ చెప్పులు ఉపశమనం కలిగిస్తాయని కేఐఈఆర్ పోడియాట్రి విభాగాధిపతి పవన్ బెలెహళ్లి సోమవారం వెల్లడించారు. కాలు ఎలాంటి ఆకృతిలో ఉన్న దానికి అనుగుణంగా మారిపోవడం వీటి ప్రత్యేకతని, నడకను బట్టి చెప్పులు వాటంతట అవే సరిచేసుకుంటాయని తెలిపారు. ఈ చెప్పులు ధరిస్తే కాళ్లకు గాయాలయ్యే అవకాశాలు చాలా తక్కువని, గాయాలైనా అవి త్వరగా మానిపోవడానికి ఉపయోగపడతాయని వివరించారు.