తండ్రి కోసం ఆటో డ్రైవర్ గా మారిన కూతురు..!

21 ఏళ్ల ఈ యువతి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో ఓ వైపు చదువుతో పాటు ఆటో నడుపుతూ తన తండ్రికి చేదోడుగా నిలుస్తోంది. జమ్మూ కశ్మీర్ కు చెందిన 21 ఏళ్ల యువతి బంజీత్ కౌర్. ఈ యువతి స్థానికంగా చదువుకుంటోంది. 

ఆమె తండ్రి ఒక స్కూల్ బస్ డ్రైవర్ గా పనిచేసేవాడు. కరోనా వైరస్ కారణంగా ఆయన తన ఉపాధిని కోల్పోయాడు. దీంతో ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కానీ ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదు. మరో వైపు ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో బంజీత్ కౌర్ కూడా తన తండ్రికి సహాయంగా ఉండాలని భావించింది. 

తన తండ్రితో పాటు ఆటో నడపాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఆమె చదువును కొనసాగిస్తూనే పార్ట్ టైమ్ గా ఆటో నడుపుతోంది. దీని ద్వారా తన తండ్రికి కొంచమైన సహాయపడగలనని ఆమె అభిప్రాయపడింది. మహిళలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. దీంతో కౌర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Leave a Comment