ప్రియుడి నుంచి విడదీశారని 15 ఏళ్ల బాలిక ఆత్మహత్య..!

టిక్ టాక్ యాప్ లో పరిచయమైన యువకుడి ఆకర్షణలో పడిన ఓ బాలిక.. అతని నుంచి తనను విడదీశారంటూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల మేరకు గరిడీ వీధికి చెందిన మానాపతి కల్పన.. భర్త లేకపోవడంతో తల్లి మునెమ్మ వద్ద ఉంటోంది.. కల్పనకు లక్ష్మీ(15)తో పాటు కిరణ్ అనే ఓ కుమారుడు ఉన్నాడు..

లక్ష్మికి చాలా కాలం కిందట టిక్ టాక్ యాప్ ద్వారా అనంతపురం పట్టణానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. 4 నెలల కిందట ఎవరికీ చెప్పకుండా అనంతపురం వెళ్లిపోయింది. దీనిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు లక్ష్మి ఆచూకీ కనిపెట్టి ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. 

ప్రియుడి నుంచి వెనక్కి తీసుకురావడంతో లక్ష్మి మనస్తాపానికి గురైంది. ఈనేపథ్యంలో కల్పన ఆదివారం ఉదయం బంధువులను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లింది. అమ్మమ్మ, అన్న కిరణ్ కూడా ఇంట్లో లేకపోవడంతో, ఒంటరిగా ఉన్న లక్ష్మి ఫ్యాన్ కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

కొద్ది సేపటికి ఇంటికి వచ్చిన కిరణ్, స్థానికుల సాయంతో తలుపులు పగలకొట్టి లక్ష్మిని కిందకు దించి, ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టు మార్టానికి తరలించారు. 

Leave a Comment