విశాఖలో అభివృద్ధికి అవకాశం: జగన్‌

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరమని, ఇంకా అభివృద్ధికి అవకాశం ఉంటుందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో ఏర్పాటు చేసిన ‘ది హిందూ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’ కార్యక్రమానికి  సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అమరావతి నిర్మాణానికి రూ.1.09లక్షల కోట్లు కావాలన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ఓ వైపు రాయలసీమలో డ్యామ్‌లు నిండటం లేదన్నారు. నిధుల కొరత వల్లే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామన్నారు.  ఒక్క రాజధానికే కాకుండా ప్రాజెక్టుల పూర్తికి నిధులు ఖర్చు చేయాలని తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేయాలన్నారు. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ప్రయోజనం ఉండాలన్నారు. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. అవినీతి లేకుండా చేసేందుకు రివర్స్‌ టెండరింగ్‌ తీసుకొచ్చామన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా అదే పని తక్కువ ధరలో పూర్తయ్యేలా చేస్తున్నామన్నారు. విశాఖలో మౌలిక వసతులన్నీ ఉన్నాయని, అమరావతిలో ఖర్చు చేసే నిధుల్లో 10 శాతం ఖర్చు చేస్తే సరిపోతుందని చెప్పారు. పదేళ్లలో హైదరాబాద్‌, బెంగళూరుతో విశాఖ పోటీపడుతుందన్నారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. అభివృద్ధి ఒక్కచోటే కేంద్రీకృతం కాకూడదని, ఉద్యోగాల కోసం భవిష్యత్‌ తరాలు వలస వెళ్లకూడదని పేర్కొన్నారు. శాసన రాజధానిగా అమరావతి ఉంటుందని, అమరావతిలో అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Leave a Comment