రోజూ 800 మందికి పరీక్షలు

హైదరాబాద్ : హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ప్రతి రోజూ 800 మందికి కరోనా వైరస్ స్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్ విస్తరించిన దేశాల నుంచి ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చైనా, హాంకాంగ్, సింగపూర్, థాయ్ లాండ్, మలేషియా దేశాల నుంచి హైదారాబాద్ వచ్చే ప్రయాణికులకు పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు ఆ దేశాలకు చెందిన 29 విమానాల నుంచి 2,700 మందిని పరిశీలించారు. 

సోమవారం రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు వెళ్లి అక్కడు జరుగుతున్న స్క్రీనింగ్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం వారు అక్కడ సమీక్ష నిర్వహించారు. వివిధ దేశాల నుంచి రోజూ వేలాది మంది ప్రయాణికులు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగుతుంటారు. వారిలో ఆ ఐదు దేశాలకు చెందిన ప్రయాణికులు రోజూ సరాసరి 800 మంది వస్తుంటారు. జలుబు, దగ్గు, తలనొప్పి వంటి కరోనా వైరస్ లక్షణాలుంటే వెంటనే తమను సంప్రదించాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కోరుతున్నారు. అటువంటి లక్షణాలతో ఇప్పటికే ఇళ్లకు చేరిన వారు ఉంటే తమను సంప్రదించాలని లేదా వారు ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు.

Leave a Comment