మహిళల రక్షణ కోసం దిశ పోలీస్ స్టేషన్లు : డీజీపీ

తూర్పుగోదావరి : దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేస్తామని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ఆయన బుధవారం రాజమండ్రిలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం దిశ పోలీస్ స్టేషన్లు చక్కగా ఉపయోగపడతాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు అర్బన్ జిల్లాలతో కలిపి 18 పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దిశ పోలీసు స్టేషన్‌లో ఇద్దరు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, 38 కానిస్టేబుళ్లతో సహా పూర్తి స్థాయిలో స్టాఫ్ ఉండే విధంగా చూస్తున్నామని తెలిపారు. దిశ పోలీసు స్టేషన్లు మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తాయని అన్నారు. త్వరలో దిశ యాప్ కూడా ప్రారంభం కానుందని, దీని ద్వారా బయట ఉన్న మహిళలకు కూడా రక్షణ కల్పించే అవకాశం ఉంటుందని డీజీపీ గౌతంమ్‌ సవాంగ్‌ తెలిపారు.

Leave a Comment