కేంద్ర బడ్జెట్‌ నిరాశపరిచింది : బుగ్గన

 హైదరాబాద్‌ : కేంద్ర బడ్జెట్‌ నిరాశపరిచిందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.  హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా, వివిధ ప్రాజెక్టులకు నిధుల మంజూరు అంశాలను ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. కేంద్రం ప్రకటించిన ట్యాక్స్‌ హాలిడేను స్వాగతిస్తున్నామని చెప్పిన ఆయన బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు పొంతన లేకుండా ఉన్నాయని పేర్కొన్నారు.

జీడీపీలో 10 శాతం పెరుగుదల అంచనా ప్రశ్నార్థకమేనని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో విభజన హామీలు పెండింగ్‌లో పెట్టడంతో రాష్ట్రానికి ఇబ్బందికర పరిస్థితి తలెత్తిందని మంత్రి బుగ్గన అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌ హక్కు అని, దీనిపైనా కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదన్నారు. కేంద్రం నుంచి ఏపీకి రూ.19వేల కోట్లు రావాలని, కడప స్టీల్‌ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావించలేదని అన్నారు. వ్యక్తిగత, కార్పొరేట్‌ పన్నులతో వ్యాపారాల వృద్ధికి కేంద్రం చర్యలు బాగున్నాయన్నారు. ఏడు నెలల పాలనలో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఆర్థిక భారం రూ.1900కోట్లు తగ్గించామన్నారు.

Leave a Comment