పదవులు కోల్పోతున్న ఇద్దరు మంత్రులు ?

మండలి రాద్దుక్కు ఆమోదం …

అమరావతి : ఏపీలో శాసనమండలి రద్దు నిర్ణయం ఖాయమైంది. దీంతో..ఏపీ కేబినెట్ లో ఇద్దరు మంత్రులకు పదవి వదులుకునేందుకు సిద్ధమయ్యారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఇద్దరికి జగన్ తన కేబినెట్ లో స్థానం కల్పించారు. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్ర బోస్..మోపిదేవి వెంకట రమణ ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కొనసాగుతూ..మంత్రులుగా ఉన్నారు. ఇక, ఇప్పుడు మండలి రద్దు నిర్ణయంతో ఆ ఇద్దరు మంత్రి పదవులు కోల్పోక తప్పని పరిస్థితి. అయితే, తీర్మానం ఆమోదం పొందినా..అది రాష్ట్రపతి ఆమోదం పొంది..తుది నిర్ణయం వచ్చే వరకూ సాంకేతికంగా మండలి సభ్యులుగా ఉంటారు. దీంతో..అప్పటి వరకూ వారు మంత్రులుగా కొన సాగే అవకాశం ఉంది. కానీ, అప్పటి వరకు మంత్రులుగా కొనసాగేందుకు సిద్ధంగా లేరనేది విశ్వసనీయ సమాచారం.ప్రభుత్వం మండలి రద్దుకు కేబినెట్‌లో నిర్ణయించిన వెంటనే అక్కడే ఆ ఇద్దరు తమ రాజీనామా లేఖలను ముఖ్యమంత్రికి అందించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి సైతం ఈ నిర్ణయానికి ముందే వారిద్దరితో చర్చించారు. వారికి స్పష్టమైన హామీ ఇచ్చారు. వారిద్దరూ సభలోనే తాము జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేసారు.జగన్ కేబినెట్ లో ఇద్దరు మంత్రులు ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కొనసాగుతూ మంత్రులుగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా మండపేట నుండి పోటీ చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓడిపోయారు. అప్పటికే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ఆయన తొలి నుండి తనతోనే అడుగులు వేస్తుండటంతో పాటుగా..నిజాయితీ కలిగిన నేతగా గుర్తింపు ఉండటంతో బీసీ వర్గం నుండి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు. ఇక, మరో మంత్రి మోపిదేవి వెంకట రమణ 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా రేపల్లె నుండి పోటీ చేసి ఓడిపోయారు. తన తండ్రి కేబినెట్ లో మంత్రిగా పని చేసి.. తనతో పాటుగా కేసుల కారణంగా జైలు శిక్ష అనుభవించిన మోపిదేవి వెంకట రమణను సైతం జగన్ తన కేబినెట్ లోకి తీసుకున్నారు. ఆయనను కొద్ది రోజుల క్రితమే ఎమ్మెల్సీగా నియమించారు. ఇప్పుడు మండలి రద్దు తీర్మానంతో వారిద్దరూ మంత్రి పదవులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఏపీ అసెంబ్లీ మండలి రద్దు తీర్మానానికి రంగం సిద్ధం చేసింది. అయితే, దీనిని కేంద్రం ఆమోదించి..రాష్ట్రపతికి నివేదించి..అధికారికంగా తుది ఆమోద ముద్ర పడిన తరువాత మాత్రమే నిర్ణయం అమల్లోకి వస్తుంది. అయితే, తమ ప్రభుత్వమే శాసనసభ లో తీర్మానం చేసి మండలి వద్దని నిర్ణయించటంతో..మండలి సభ్యులుగా ఉంటూ మంత్రి పదవుల్లో ఉన్న ఇద్దరూ తమ పదవులను వదులుకొనేందుకు సిద్దం అయ్యారు. తుది ఆమోదం పొందే వరకూ సాంకేతికంగా మండలిలోని సభ్యులంతా ఎమ్మెల్సీలుగా కొనసాగుతారు. మంత్రులుగా ఉన్న బోస్..మోపిదేవి సైతం తుది నిర్ణయం వచ్చే వరకూ మంత్రివర్గంలో కొనసాగే అవకాశం ఉన్నా నైతికతను దృష్టిలో పెట్టుకుని వారిద్దరు రాజీనామాకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. మండలిలో జరిగిన పరిణామాలతో బాధతో ఆ సభను రద్దు చేస్తూ తీర్మానం చేయటంతో తక్షణమే తమ మంత్రి పదవులకు సైతం రాజీనామా చేయటానికి వారు సిద్దపడినట్లు సమాచారం. కానీ, సీఎం సూచనల మేరకు వారు నడుచుకొనే అవకాశం ఉంది.శాసన మండలిలో సభ్యులుగా ఉంటూ..మంత్రులుగా ఉన్న ఇద్దరూ శాసనసభలో మాట్లాడే సమయంలోనే మండలి రద్దుకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తాము మండలి సభ్యులుగా ఉంటూనే ఇదే విషయాన్ని చెబుతున్నామని ముఖ్యమంత్రికి సూచించారు. ఇదే సమయంలో ప్రస్తుతం మండలిలో వైసీపీ నుండి ఈ ఇద్దరి మంత్రులతో పాటుగా మరో ఏడుగురు సభ్యులు ఉన్నారు. వీరందరికీ పార్టీ నేతలు ముందుగానే సమాచారం ఇచ్చారు. వారికి ప్రత్యామ్నాయంగా తగిన గుర్తింపు దక్కే విధంగా చూసుకుంటామని సీఎం మాటగా హామీ ఇచ్చారు. ఇక, ఈ ఇద్దరు మంత్రులకు మాత్రం కీలక పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉందని..ఇద్దరూ అంకిత భావంతో..నిబద్దతతో పని చేసే వ్యక్తులుగా సీఎం అభిర్ణించినట్లుగా తెలుస్తోంది. వారికి సైతంఅన్యాయం చేయరని స్వయంగా ముఖ్యమంత్రే..చూసుకుంటానంటూ హామీ ఇచ్చినట్లుగా సమాచారం. దీంతో..వీరిద్దరి ఆధీనంలో ఉన్న శాఖలను ఇతర మంత్రులకు కేటాయిస్తూ కేబినెట్ లో పోర్టుఫోలియోల్లో మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది

Leave a Comment