ఆర్ధిక మూలాలపై దెబ్బ కొడుతున్నాడు : జేసి

విజయవాడ : సీఎం జగన్ మనుషులను చంపకుండా ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతున్నారని మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు జేసి దివాకర్ రెడ్డి విమర్శలు చేశారు. శనివారం ఆయన మాట్లాడారు. అధికారం ఉందనే అహంతో జగన్ కక్షపూరితంగా దివాకర్ ట్రావెల్ బస్సులను నిలిపేశాడని ఆరోపించారు. బస్సుల సీజ్ విషయంలో కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయలేదని మండిపడ్డారు. కోర్టులను లెక్క చేయని ఆయనకు ధన్యవాదాలు అని చెప్పారు. తమను మరో విధంగా దెబ్బ తీసేందుకు త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ భూములను వెనక్కి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా తమకు ఏమి కాదన్నారు. ప్రభుత్వ చర్య పై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. సున్నపు రాయి నిక్షేపాలను తరలించినట్టు వస్తున్నా ఆరోపణలను తోసిపుచ్చారు.ప్రధాని మోడీకి చెప్పే చేస్తున్నామంటూ అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. రాజధాని తరలింపుపై హై కోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేశారని అన్నారు. కార్యాలయాలు తరలించవద్దని కోర్టు ఉత్తర్వులను ఏం చేస్తాడని ప్రశ్నించారు. జగన్ ది ప్రమాదకర ధోరణి అని, వ్యవస్తలన్నిదెబ్బతింటాయని విమర్శించారు. సీఎం జగన్ ది ఫ్యాక్షన్ సంస్కృతి అని, ఆయనకు రాజారెడ్డి మనస్తత్వం వచ్చిందని అన్నారు. జగన్ కు మంచి బుద్ది ప్రసాదించాలని ప్రభువును కోరుకుంటున్నానని చెప్పారు.

Leave a Comment