అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాలి – ఉప రాష్ట్రపతి

హైదరాబాద్‌ : అవినీతి చీడను పారద్రోలి సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల పరిష్కారానికి బాటలు వేయాల్సిన బాధ్యత సివిల్‌ సర్వీసెస్‌ అధికారులదేనని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. సుపరిపాలన ద్వారా దేశ సమగ్ర, సుస్థిరాభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని ఎంసిహెచ్‌ఆర్‌డిలో అఖిలభారత సర్వీసులు-సివిల్‌సర్వీసులు, మిలిటరీ ఇంజనీరింగ్‌ సర్వీసు అధికారుల ఫౌండేషన్‌ కోర్సు సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. ‘సివిల్‌ సర్వెంట్స్‌కు ప్రజా సేవేపరమావధిగా కావాలి. దీని కోసం అనుక్షణం నీతి, నిజాయితీతో పనిచేయాలి. ఏదో ఉద్యోగం చేస్తున్నాం కదా అని అనుకోకుండా ప్రజా సేవను బాధ్యతగా భావించండి’ అని ఉపరాష్ట్రపతి ఉద్బోధించారు.

కనీస వసతులు కల్పించాలి..

దేశాన్నిపట్టిపీడిస్తున్న పేదరికం , నిరక్షరాస్యత, కుల, మత లింగ వివక్షలను పారదోలడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కనీస వసతుల కల్పనను ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకుని పనిచేయాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు సుపరిపాలనే సరైన మార్గమమన్నారు. సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా లబ్ధిదారులకు చేర్చే అంశంలో వినూత్న పద్దతులను ఆచరించాలని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు అధికారులే వారిధి అని, ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడం, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి విన్నవించి వాటి పరిష్కారానికి చొరవ తీసుకోవడంలో మీ పాత్ర కీలకమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని వేర్వేరు అంశాలను, కార్యక్రమాలను సమన్వయం చేస్తూ క్షేత్రస్థాయిలో సమర్ధవంతంగా నిర్వర్తించే గురుతర బాధ్యత సివిల్‌సర్వీసెస్‌ అధికారుల పై ఉంటుందన్నారు. దేశ రక్షణ వ్యవస్ధ, అనుబంధ రంగాల్లో మిలిటరీ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ వ్యవస్ద కీలకమైందన్నారు. మిలిటరీ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులకు ప్రత్యక్షంగా , పరోక్షంగా దేశ రక్షణ వ్యవస్థలో భాగస్వాములయ్యే అవకాశం దొరుకుతుందన్నారు. ఈ వ్యవస్థలోనూ అవినీతికి తావులేకుండా లక్ష్యాలను నిర్ధేశించిన సమయంలో పూర్తిచేయడంలో చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంసిహెచ్‌ఆర్‌డి డైరెక్టర్‌ జనరల్‌ బి.పి.ఆచార్య, కోర్స్‌ డైరెక్టర్‌ హర్‌ప్రీత్‌సింగ్‌, మిలిటరీ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ సీఈ బ్రిగేడియర్‌ పీకేజీ మిశ్రాతోపాటు పలువురు ఐఏఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

Leave a Comment